19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నాకీవేళ ఈ పద్యం గుర్తుకొచ్చింది !

ఎందుకో నాకీవేళ ఈ పద్యం గుర్తుకొచ్చింది. మీకు తెలిసిన అర్థాన్ని వ్యాఖ్య గా వ్రాసుకోండి :). ఇది వసుచరిత్ర లోని పద్యము. పద్యము చదవకండి. పద్యము పాడుకొంటూ హృదయకుహర లయల ఆనంద నాట్యానికి తాళం కలపండి.

సీ : లలనా జనాపాంగ వలనావసదనంగ
తులనాభికాభంగ, దోః ప్రసంగ
మలసానిలవిలోల దళసా సవరసాల
ఫలసాదర శుకాల పన విశాల
మలినీగరుద నీక మలినీ, కృతధునీ క
మలినీ సుభితకోక కులవధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత

మకృత కామోద కురవకా వికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీవి
భాసురము వొల్చు మధువాస వాసరమ్ము

33 కామెంట్‌లు:

  1. మాకంత సీన్ లేదండీ. ఏ భైరవ భట్ల గారో, కౌటిల్య గారో వచ్చి వివరణ చెపితే వచ్చి చదివి పెట్టి కామ్ గా ఇక్కడ నుంచి తప్పుకొని వెళ్ళి పోతాము.
    అయినా పొద్దుటే మాకు ఈ పరీక్షలెందుకు..హాయిగా వివరణ కూడా ఇవ్వవచ్చు కదా.

    రిప్లయితొలగించండి
  2. కనీసం కల్పనగారికైనా కొంత సీన్ వుండొచ్చేమో కాని మాలాటి పామరులకి అసలుకే లేదు . ఒకటికి పదిసార్లు చదివిన అర్ధం కావడం లేదు .ఆ కింద భావం కూడా రాసేయండిబాబు .

    రిప్లయితొలగించండి
  3. మరదే ఇట్టాంటి పనులు చేత్తేనే ఎక్కడో కాలేది.(హిహిహి)'

    రిప్లయితొలగించండి
  4. కల్పన గారూ, ఇదేమీ పరీక్షలు కాదండీ.మీకు తెలియకపోతే ఇంక నాకేమి తెలుస్తుంది చెప్పండి? మీరన్నట్టు వారు వచ్చి తాత్పర్యం చెప్పాలి ఇంక.

    రిప్లయితొలగించండి
  5. చిన్నీ గారూ అబ్బే ! ఎందుకో వసంతాగమనం గుర్తుకొచ్చి ఈ పద్యం గుర్తొచ్చిందండి

    రిప్లయితొలగించండి
  6. పప్పూ, పప్పుచారు తినక మీకెందుకయ్యా నోట్లో చికెన్ ముక్క?

    రిప్లయితొలగించండి
  7. తకిట థధిమి...తకిట థధిమి తంధాన, ఏదో తాళం వేయమన్నారు కదా అని వేసాను...నాకూ అర్థంకాలేదు:)

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. అంటే మీకు కూడా అర్ధం తెలియక ఇక్కడ ఇచ్చారా? సరిపోయింది. మిమ్మల్ని నమ్మి మొత్తం పద్యం అంతా అనవసరం గా చదివాము కదండీ. ఇంతకీ తమరికి ఈ పద్యం నోటికి వచ్చా? లేక ఎక్కడైనా చొర్యామ్ చేసితీరా మహాశయా!

    రిప్లయితొలగించండి
  10. రెడ్డి గారూ,
    నాకెంతో ఇష్టమైన పద్యాన్ని గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు. కావాలంటే ఈ పద్యానికి వివరణ ఇస్తాను. కాకపోతే కొంత వ్యవధి కావాలి.

    రిప్లయితొలగించండి
  11. పద్మార్పితా, మీకు తాళం వేయమని నేను చెప్పాలా సుమీ ;). మనకు [ మీకు కూడా అనుకుంటాను ] గురు సమానులు శంకరయ్య గారు వివరణ ఇస్తామన్నారు కాబట్టి వారి వివరణ కోసం వేచి చూద్దాము నేస్తం.

    రిప్లయితొలగించండి
  12. హ హా కల్పనగారూ, మీరేంటండీ ఏకంగా నా రెండు కాళ్ళు గుంజేసే పనిలో పడ్డారు. ఈ పద్యం మా తెలుగు అయ్యవారు [ చిన్నాన్న కూడా ] నాకు మరీ మరీ వీపున నాలుగు తగిలించి నేర్పిన పద్యము :). పద్యానికి వివరణ సగం తెలిసి సగం తెలియక చెప్పేనాకన్నా, తెలుగు టీచరు గా చాలా అనుభవాన్ని గడించిన శంకరయ్య గారు చెప్తామన్నారు కాబట్టి వేచి చూద్దాము కల్పనా. ఏమంటారు. ఇక నన్ను చౌర్యము చేసానంటావా?

    అమ్మా కల్పన ఎంతటి
    నమ్మక మోయమ్మ? ఏను నా యలివేణీ
    సమ్మోహిత మదె దోచితి
    నమ్మా! ఇది కాదు తల్లి, నను నమ్మమ్మా!

    రిప్లయితొలగించండి
  13. గురువర్యా శంకరయ్య గారూ ముందుగా ధన్యవాదాలు. ఈ పద్యం ఎంత కష్టపడి ఏడుస్తూ నేర్చుకున్నానో చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టమైన పద్యము. మీ వివరణ కొరకు వేచిచూస్తుంటాను. వ్యాఖ్య ద్వారా కాకుండా మీ బ్లాగులో ఒక పూర్తి స్థాయి నిడివి గల టపా వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  14. హెంత మాటన్నారు బా.రా.రె "ఐ హర్టెడ్" అంతే ,నా కగమానం జరిగిపోనాది,నేనొప్ప నేనొల్ల.

    రిప్లయితొలగించండి
  15. శ్రీనివాస్ గారూ, మిమ్మల్ని హర్ట్ చేయ్యాలని కావాలని వ్రాసింది కాదు సుమీ ఆవ్యాఖ్య , అది వ్యాఖ్యకు సమాధానము మాత్రమే. అంతకు మించి వేరే అర్థాలు ఏమీ లేవు :)

    రిప్లయితొలగించండి
  16. భలేవారు భారారె మీరు.మీరన్నది నాకర్ధ మయింది కాని నేనూ సరదాగానే రాసానండి.అయినా మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ అవసరమంటారా?

    రిప్లయితొలగించండి
  17. భా.రా.రె. బహుశా ఒక రెండువారల క్రితం నాకూ ఈ పద్యాన్ని గురించిన ప్రసక్తి వచ్చింది. నాకీ అంశాలు క్రొత్త. కానీ ఆసక్తి వలన కాస్త అధ్యయనం మొదెలెట్టా..

    కురవకా - అన్నది ఒక పుష్పం

    "వన్యధాస్యంబులు ముడియలం గావళ్ళం బెట్టించు
    కొని కదలి కదలికా, చందన, స్యంద్న, మరువకా, గురు, కురవకా
    శోక పూగ పున్నాగ, భూర్జ, ఖర్జూర, సర్జ,్కార్జున, శిగ్ర, న్యగ్రోధ
    గగ్గులు, .."

    అన్నది శృంగార శాకుంతల కావ్యములో వస్తుంది.

    **************

    మీరిలా చక్కని పద్యాలని, ఆ ద్వారా వివరణలని మాకు అందించాలని ఆశిస్తూ

    రిప్లయితొలగించండి
  18. లలనా జనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ ..... పద్యానికి వివరణ
    వసంత ఋతువులోని ఒకానొక రోజు ఎలా ఉందో కవి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వర్ణించిన విధం -
    లలనాజన = స్త్రీజనం యొక్క / అపాంగ = క్రీగంటి చూపుల / వలన = చలనంలో / అవసత్ = నివసించే / అనంగ = మన్మథునితో / తులన = సమానమైనవారైన / అభిక = కాముకుల యొక్క / అభంగ = అంతరాయం లేని / దోఃప్రసంగము = కౌగిలింతల ముచ్చట్లు కలదీ
    అలస = మెల్లగా వీచే / అనిల = గాలిచేత ( మందమారుతం చేత ) / విలోల = బాగా కదులుతున్న / దళ = చిగురాకులు కలవీ / స + ఆసవ = మకరందంతో కూడినవీ అయిన / రసాల = తియ్య మామిడి చెట్ల / సాదర = ఆదరంతో కూడిన / శుక = చిలుకల / ఆలాపన = ఆలాపాల చేత / విశాలము = విస్తారమైనదీ
    అలినీ = ఆడ తుమ్మెదల / గరుత్ = రెక్కల / అనీక = సమూహం చేత / మలినీకృత = నల్లగా చేయబడిన / ధునీ = నదీ సంబంధమైన / కమలినీ = తామర తీగల్లో / సుఖిత = సుఖంగా ఉన్న / కోకకుల వధూకము = చక్రవాక స్త్రీలు కలదీ
    అతికాంత = మిక్కిలి మనోహరాలైన /సలతాంత = పూలతో కూడిన / లతిక = తీగల / అంతర = లోపల / నితాంత = ఎడతెగని / రతికాంత = రతి భర్త ఐన మన్మథుని / రణ = యుద్ధంలో / తాంత = అలసిన / సుతనుకాంతము = స్త్రీ పురుషులు కలదీ
    అకృతక = సహజమైన / ఆమోద = పరిమళం కల / కురవక = గోరంట పువ్వులు కలవీ / అవికల = విచ్చిన్నం కాని / వకుళ = పొగడ చెట్ల / ముకుళ = మొగ్గలు కలవీ అయిన / సకల = సమస్త / వనాంత = వన మధ్యంలో / ప్రమోద = సంతోషంతో / చలిత = సంచరిస్తున్న / కలిత = ఒప్పుగా ఉన్న / కలకంట = కోయిలల / కుల = సమూహం యొక్క / కంట కాకలీ = కంఠంనుండి వెలువడే మధుర ధ్వని చేత / భాసురము = ప్రకాశిస్తున్న / మధుమాస వసరంబు = వసంత ఋతువులోని ఒక దినం / పొల్చున్ = విలసిల్లుతున్నది.
    వసంత ఋతువులోని ఒకానొక రోజు స్త్రీల కడగంటి చూపులు శృంగార రస ప్రేరితాలూ మన్మథోద్దీపకాలూ అయ్యాయి. కాముకులు స్వేచ్చగా క్రీడించారు. తియ్య మామిడి చిగురించి పండ్లు పండి ఫలరసాలు దొరికాయి. ఆ పండ్లను తిని చిలుకలు పలికాయి. నదులలో తమర తీగలు బాగ పూచాయి. వాటిని తుమ్మెదలు గుంపుగా కమ్ముకొన్నాయి. ఆ తమర తీగల్లో చక్రవాకాలు సుఖంగా ఉన్నాయి. పూ పొదరిండ్లలో స్త్రీ పురుషులు రతికేళి జరుపుతున్నారు. గోరంటలు పూచాయి. పొగడలు మొగ్గ తొడిగాయి. కోయిలలు మధుర ధ్వనులు చేసాయి.

    రిప్లయితొలగించండి
  19. మీ దయ వలన, మా భాగ్యము వలన ఒక చక్కని పద్యానికి అర్థం తెలుసుకోగలిగాము.శంకరయ్యగారికి అభినందనలు.మా చిన్నప్పటి తెలుగు సార్ పేరు కూడా శివ శంకర్ గారే.(అయ్యా శంకరయ్యగారు, మీరు హైదరాబాదులో చదువు చెప్పారా? తెలియచేయగలరు.)

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్య గారు అర్ధం చెప్పక ముందు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు ఐనా అంత పెద్ద పద్యాలు బట్టీ పట్టేవాడివా చిన్నప్పుడే అమ్మో బాబో అందుకే అట్లా అతల కుతల పాతాళ రసాతల అంటూ బోలెడంత గ్రాంధికం గా కవితలు రాస్తావు? అయ్యి ఐనా అర్ధం అయ్యి రాస్తావా అర్ధం కాకూండా ఈ పద్యం లాగానే రాసేస్తావా? ;-)
    చాలా బాగుంది పద్యం. ధన్యవాదాలు శంకరయ్య గారు.

    రిప్లయితొలగించండి
  21. అనూ గారూ,
    నేను వరంగల్లో 38 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేసి గత సంవత్సరం రిటైర్ అయ్యాను. సమయాభావం వల్ల ఆ పద్యానికి ఏదో వివరణ ఇచ్చాను కాని నాకు తృప్తికరంగా లేదు.

    రిప్లయితొలగించండి
  22. ఉషా కవితలతో పాటి పద్యాలు కూడానా? మీ వ్యాఖ్యలో ఒక్క ముక్క అర్థమయితే ఒట్టు. ఇంక ఆలస్యం ఎందుకు పనిలో పనిగా సంస్కృతాన్ని కూడా నేర్చుకో.

    రిప్లయితొలగించండి
  23. శంకరయ్య గారూ, ప్రతిపదార్థ వివరణనిచ్చి ఒక మంచి పద్యాన్ని మాకు అర్థమయ్యేట్టు చెప్పిన మీకు కృతజ్ఙతలు. మీరు ఇలాంటి మంచి మంచి పద్యాలను వివరంగా వ్రాస్తారాని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  24. అనూ గారు మీ ప్రేమపూరిత వ్యాఖ్యలకు ధన్యవాదాలండి. ఇందులో నా దయ ఏమీ లేదండి. శంకరయ్య గారి వల్ల మనకు ఈ పద్యానికి అర్థం తెలిసింది. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఇద్దో భావనా గారూ బాగుందా ఇది? ఎక్కడ చదివానబ్బా ఇది!!!

    "అతల కుతల పాతాళ రసాతల లోకాలయందు వెతికి నా భామ జాడ కానలేక
    విసిగి వేసారి మదీయ దుఃఖము ఏమని చెప్పేద అకటా నా బాధ ను కనరే
    లతా లలామ మణులారా.. విశాల శుభ్ర నేత్ర పరివృత తరుణీ మణులారా
    ఈ దీనుని కంచి అమ్మది కాదు సంతసించ నా ప్రేయసి జాడ చెప్పరే.."

    అన్నట్టు ఇప్పటిదాకా నాకవితలు గ్రాంధికంలో వుండి అర్థమవలేదా? అంటే మీరు అర్థము కాకుండానే కామెంట్లు వ్రాస్తున్నారా? ;)

    రిప్లయితొలగించండి
  26. మీ బ్లాగులోకి అప్పుడే వసంతం వచ్చేసినట్టుందే! బాగుంది.

    రిప్లయితొలగించండి
  27. వసుచరిత్ర పద్యాలు ఇంకా కూడా పెడితే బాగుంటుంది సార్ వసంత వర్ణన గురించి ఉన్నవి.

    రిప్లయితొలగించండి

Comment Form